Personality Development

 Personality Development 

ఒక నిర్ణయం మీ జీవితాన్నే మార్చేస్తుంది.. మరి సరైన డెసిషన్‌ తీసుకోవడంలో ఈ టిప్స్‌ పాటించాల్సిందే

Personality Development
Personality Development | ఏ నిర్ణయానికైనా సమాచారం పునాది అయితే.. విశ్లేషణ నిర్మాణం. రెండూ కీలకమైనవే. ‘అనాలసిస్‌ పెరాలసిస్‌' అనేది సరైన నిర్ణయం తీసుకునేటప్పుడు అతిపెద్ద అడ్డంకి. విశ్లేషణ సరైన దిశలో సాగకపోవడం వల్ల జరిగే నష్టమిది. ఎక్కడ తప్పుడు నిర్ణయం తీసుకుంటామో అని పదేపదే అదే సమాచారాన్ని విశ్లేషించుకోవడం ఫక్తు చాదస్తమే. 

Personality Development | ఒక నిర్ణయం మీ జీవితాన్నే మార్చేస్తుంది.. మరి సరైన డెసిషన్‌ తీసుకోవడంలో ఈ టిప్స్‌ పాటించాల్సిందే
Personality Development | పొద్దున్నే.. కాఫీ తాగాలా, చాయ్‌ తాగాలా? ఒక నిర్ణయం.
స్నానం చేసి బ్రేక్‌ఫాస్ట్‌ చేయాలా, లేదంటే ముందే తినేయాలా? ఒక నిర్ణయం.
వైట్‌ షర్ట్‌ వేసుకోవాలా, పింక్‌ షర్ట్‌ వేసుకోవాలా? ఒక నిర్ణయం. లంచ్‌ తీసుకెళ్లాలా? క్యాంటీన్‌లో తినేయాలా? ఒక నిర్ణయం.
పాత ఉద్యోగం చేయాలా? కొత్త కంపెనీలో చేరాలా? ఒక నిర్ణయం.
ప్రేమించి పెళ్లి చేసుకోవాలా? పెద్దలు కుదిర్చిన అమ్మాయికి తాళి కట్టాలా? ఒక నిర్ణయం.

ఇక్కడితో ఈ చిట్టా ఆగిపోదు. పిల్లలు, వాళ్ల చదువులు, కట్టుకోబోయే ఇల్లు, రిటైర్మెంట్‌ ప్లాన్‌.. చిన్నదైనా, పెద్దదైనా ప్రతి నిర్ణయం కీలకమే. మంచి నిర్ణయం మనమీద మనకు నమ్మకాన్ని పెంచుతుంది. విఫల నిర్ణయం
మనోబలాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి, నిర్ణయ కళ మీద పట్టు సాధించడం అత్యవసరం.

అన్నప్రాశన నాడు పిల్లాడి ముందు ఓ నాలుగు రకాల వస్తువులు పెడతారు. వాటిలో దేన్ని ఎంచుకోవాలో నిర్ణయించుకోవాల్సింది ఆ బిడ్డే. దాన్ని బట్టే భవిష్యత్తులో ఏమవుతాడనే అంచనాకు వస్తారు. అది మొదలు మాత్రమే! ఏ స్కూల్‌, ఏ సిలబస్‌, ఏ కోర్స్‌, ఏ ఉద్యోగం… ఇలా అడుగడుగునా మనల్ని నడిపించేది నిర్ణయాలే. టీవీ బ్రాండ్‌ నుంచి పెళ్లి బ్యాండ్‌ వరకు నిర్ణయాలే జీవితాన్ని నిర్దేశిస్తాయి. అందుకని, నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెబుతారు నిపుణులు. కార్పొరేట్‌ వ్యవస్థలో కావచ్చు. పోటీ ప్రపంచంలో కావచ్చు. మనం తీసుకునే ప్రతి నిర్ణయం మనల్ని అధఃపాతాళంలోకో, ఆకాశపు అంచులవరకో తీసుకెళ్లే అవకాశం ఉంది. అందుకే నిర్ణయ కళను ఓ శాస్త్రంగా భావిస్తున్నారు. మెకిన్సే సంస్థ నివేదిక ప్రకారం… ఉన్నత స్థాయి అధికారులు, తమ వృత్తిలో 40 శాతం సమయాన్ని నిర్ణయాలు తీసుకోవడానికే ఉపయోగిస్తారు. ఇంత సమయం వెచ్చిస్తున్నా, రోజువారీ బాధ్యతల్లో నిర్ణయానికి తగినంత వాటా ఉండటం లేదనే న్యూనత చాలా మందిని పీడిస్తున్నది. ఏ స్థాయిలో ఉన్నవారైనా.. సరైన సమయంలో, సరైన నిర్ణయం సత్వరమే తీసుకోవడం చాలా
అవసరం. దానివల్ల ఎన్ని ఉపయోగాలో తెలియ చెప్పేందుకు చాలా విశ్లేషణలే జరుగుతున్నాయి.

ఏడు అంచెలు..
మసాచుసెట్స్‌ విశ్వవిద్యాలయం ప్రకారం నిర్ణయం తీసుకోవడంలో మొత్తంగా ఏడు అంచెలు ఉంటాయి.

☞ నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం.
☞ దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడం.
☞ ఆ సమాచారం ఆధారంగా ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్వేషించడం.
☞ ప్రతి ఎంపికతో ముడిపడిన బలాబలాలనుగమనించడం.
☞ వాటిలో సరైనదాన్నే ఎంచుకోవడం.
☞ ఆ దిశగా అడుగులు వేయడం.
☞ ఫలితాన్ని బట్టి మనం తీసుకున్న నిర్ణయాన్నిసమీక్షించుకోవడం.

నిజానికి ఈ అంచెలు చెప్పేందుకు విశ్వవిద్యాలయమే అవసరం లేదు. మనందరికీ తెలిసిన విషయాలే ఇవన్నీ. కానీ ఈ క్రమంలో మన విచక్షణను ప్రభావితం చేసే అంశాల పట్ల కొంత జాగ్రత్త అవసరం.

సమాచారం… విశ్లేషణ!
ఏ నిర్ణయానికైనా సమాచారం పునాది అయితే.. విశ్లేషణ నిర్మాణం. రెండూ కీలకమైనవే. ‘అనాలసిస్‌ పెరాలసిస్‌’ అనేది సరైన నిర్ణయం తీసుకునేటప్పుడు అతిపెద్ద అడ్డంకి. విశ్లేషణ సరైన దిశలో సాగకపోవడం వల్ల జరిగే నష్టమిది. ఎక్కడ తప్పుడు నిర్ణయం తీసుకుంటామో అని పదేపదే అదే సమాచారాన్ని విశ్లేషించుకోవడం ఫక్తు చాదస్తమే. నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్న ప్రతిసారీ ఏదో ఒక కొత్త అనుమానంతో మళ్లీ మొదటికి వచ్చేస్తాం. మన దగ్గర ఉన్న సమాచారంలో కచ్చితత్వం లేకపోవడమే విశ్లేషణా పక్షవాతానికి దారితీస్తుంది. నిర్ణయం తీసుకునేందుకు ఎలాంటి సమాచారం, ఎంతమేరకు అవసరం అనే స్పష్టత లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. వీలైనంత ఎక్కువ సమాచారాన్ని సేకరిస్తే, దానినుంచి ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చనే అపోహ వల్లే ఇలా జరుగుతుంది. ఉదాహరణకు ఓ కారు కొనాలని అనుకున్నాం. సవాలక్ష బ్రాండ్‌లు, మాడల్స్‌ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ప్రతి కంపెనీ మాడల్‌ గురించీ ఇంటర్నెట్‌లో అంతులేని సమాచారం దొరుకుతున్నది. ఇలాంటి నేపథ్యంలో మన అవసరం ఏమిటి అన్న స్పష్టత లేకపోతే… అనాలసిస్‌ పెరాలసిస్‌లో ఏదో ఒక సమస్య మనల్ని తప్పుదోవ పట్టించి, చివరికి తప్పుడు నిర్ణయానికి దారితీస్తుంది. అనాలసిస్‌ పెరాలసిస్‌కు విరుద్ధమైన పరిస్థితి కూడా ఒకటుంది. అదే Extinction by instinct! సరైన సమాచారం అందుబాటులో లేకుండానే, తగినంత విశ్లేషణ చేయకుండానే నిర్ణయం తీసుకునే దుందుడుకు మనస్తత్వం.

పద్ధతిగా..
నిర్ణయం తీసుకునేందుకు చాలా పద్ధతులే ఉన్నాయి. దాదాపు వందేళ్ల క్రితమే రూపొందించిన ‘డెసిషన్‌ అనాలసిస్‌’ పద్ధతిని చాలామంది నిపుణులు పాటిస్తూ ఉంటారు. దేని గురించి నిర్ణయం తీసుకోవాలి, దాని
పరిమితులు ఏమిటి, ఎలాంటి మార్గాలున్నాయి, వాటిని సాధించడానికి ఏం చేయాలి, వాటిలో ఏ నిర్ణయం తీసుకుంటే ఎలాంటి ఫలితం రావచ్చు.. మొదలైన విషయాలన్నీ డెసిషన్‌ అనాలసిస్‌లో భాగంగా ఉంటాయి. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్లు కూడా వచ్చేశాయి. ఇలాంటి మరికొన్ని పద్ధతులు ఇవీ…

☞ ప్రాధాన్యాల ఆధారంగా ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం. ఉదాహరణకు పెట్టుబడి పెట్టేటప్పుడు తక్కువ రిస్క్‌ ఉండాలా, ఎక్కువ రిస్క్‌ ఉండాలా అనే విషయంలో మన ఆసక్తి, రిస్క్‌ తీసుకునే శక్తి ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చు. బండి కొనేటప్పుడు మైలేజ్‌, హోటల్‌కు వెళ్లేటప్పుడు సర్వీస్‌ రేటింగ్‌… ఇలా ఏదో ఒక అంశానికి ప్రాధాన్యం ఇచ్చి ఎంపికను ఖరారు చేయవచ్చు.

☞ అన్నిటికంటే తృప్తినిచ్చే నిర్ణయం తీసుకోవడం కూడా ఒకానొక ఉత్తమ మార్గం. ఈ పద్ధతిలో మనసు చెప్పిన మాటే వింటాం. ఎప్పటినుంచో ఫలానా ప్రాంతంలో డూప్లెక్స్‌ బంగళా తీసుకోవాలన్నది మన కల. అలాంటి అవకాశం కనుక వస్తే… వాస్తు, రీసేల్‌ విలువ లాంటి వివరాలనూ పెద్దగా పట్టించుకోం.

☞ కొన్ని సందర్భాలలో మనకంటే అనుభవజ్ఞులనో, పెద్దలనో సంప్రదించి వారి సూచన ప్రకారం నిర్ణయం తీసుకోవడం మేలనిపిస్తుంది. ఉమ్మడి కుటుంబాల్లో ఈ తరహా పద్ధతి అమలులో ఉండేది. ఇప్పుడు ఆ స్థానంలో మార్గదర్శి (మెంటర్‌) సూచనలు పాటిస్తున్నారు.

☞ ఎవరైనా మనల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు, మోసం చేస్తున్నారు, బలవంత పెడుతున్నారు అనే భావన కలిగినప్పుడు… వారి సూచనలకు విరుద్ధమైన నిర్ణయం తీసుకోవడం కూడా తరచూ జరిగేదే.

అలసిన వేళ ఆలోచన
కిలోమీటర్ల కొద్దీ నడిస్తే కాళ్లు మొద్దుబారిపోతాయి. గంటల కొద్దీ చదివితే కళ్లు నొప్పులు పెడతాయి. మరి మెదడు? అది కూడా ఓ అవయవమే కదా! నిరంతరం ఆలోచిస్తూ ఉంటే, నిర్ణయం తీసుకోవడంలోనే గంటల తరబడి గడిపేస్తూ ఉంటే… మెదడు కూడా అలసిపోతుంది. దీనికే డెసిషన్‌ ఫెటిగ్‌ (Decision Fatigue) అని పేరు. జీవితం సాదాసీదాగా గడిచిపోయే రోజుల్లో ఈ డెసిషన్‌ ఫెటిగ్‌ వల్ల పెద్దగా నష్టం ఉండేది కాదు. కానీ ఇప్పటి జీవనశైలి వేరు. కెరీర్‌ పరుగులో ఎన్నో నిర్ణయాలు తీసుకోవాలి. వస్తువినిమయ ప్రపంచంలో ప్రతి కొనుగోలు కోసం ఎంతో ఆలోచించాలి. ఈ పరిస్థితి మన డెసిషన్‌ ఫెటిగ్‌కు దారితీస్తుంది. ఉదాహరణకు ఓ సూపర్‌ మార్కెట్లోకి టీ పొడి కోసం అడుగుపెడితే… అక్కడ ఉండే వేలాది ఉత్పత్తులు మనల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తాయి. డిస్కౌంటుతో, సరికొత్త ప్యాక్‌లతో, వన్‌ ప్లస్‌ వన్‌ ఆఫర్లతో… ప్రతీ ఉత్పత్తీ మనల్ని ఊరిస్తుంది. మనసు వాటిని కొనమంటే, మెదడు ఆ నిర్ణయాన్ని తిరస్కరిస్తుంది. ఇలా అడుగడుగునా మనకు తెలియకుండానే, ఓ చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది. మెదడు అలసిపోయి, సరైన నిర్ణయాన్ని తీసుకునే సామర్థ్యం కోల్పోతుంది. ఫలితం- టీపొడి కోసం వెళ్లినవాళ్లం కాస్తా బస్తా సామగ్రితో బయటపడతాం. డెసిషన్‌ ఫెటిగ్‌కు సూపర్‌ మార్కెట్‌ ఓ ఉదాహరణ మాత్రమే. బోర్డ్‌ మీటింగ్‌ నుంచి, న్యాయస్థానాల వరకు అన్నిచోట్లా ఈ ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. తెలివైనవారిగా పేరుపొందిన పారిశ్రామికవేత్తల నుంచి కష్టపడి ఎదిగిన సెలెబ్రిటీల వరకు… కొన్ని చిత్రమైన నిర్ణయాలతో తమ కెరీర్‌ నాశనం చేసుకోవడానికి ఓ ముఖ్య కారణం ఈ డెసిషన్‌ ఫెటిగ్‌ అంటారు. దీన్ని అధిగమించే మార్గం ఉంది.

☞ మన ప్రాధాన్యాలను ముందుగానే నిర్ణయించుకుని, వాటికి కట్టుబడి ఉండటం.
☞ నిర్ణయం తీసుకోలేకపోతున్నాం అని గ్రహించినప్పుడు, కాసేపు విరామం తీసుకోవడం.
☞ మనసు ప్రశాంత స్థితిలో ఉండే ఉదయపు వేళల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం.
☞ చాలామంది ప్రతి విషయంలోనూ తాత్సారం చేస్తుంటారు. ఏ టిఫిన్‌ తినాలి, ఏ చొక్కా వేసుకోవాలి, స్నేహితుడికి ఫోన్‌ చేయాలా వద్దా, టీ తాగాలా వద్దా లాంటి విషయాల్లోనూ తెగ ఆలోచించేస్తుంటారు. ఫలితం! ముఖ్యమైన నిర్ణయాల దగ్గరికి వచ్చేసరికి మెదడు అలసిపోతుంది.
☞ అనాలసిస్‌ పెరాలసిస్‌లో చెప్పుకొన్నట్టుగా సమస్యకు మించిన సమాచారం, అవసరానికి మించిన విశ్లేషణ… మెదడును నీరసింపచేస్తాయి.
☞ రణగొణధ్వనులు, అనారోగ్యం, మత్తు, చిరాకు, గొడవ, ట్రాఫిక్‌… లాంటివన్నీ డెసిషన్‌ ఫెటిగ్‌ కలిగించేవే. ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి అనుకున్నప్పుడు వీటికి దూరంగా ఉన్న పరిస్థితులను ఎంచుకోవాలి.

కాగ్నిటివ్‌ బయాస్‌
సరైన నిర్ణయం తీసుకునేందుకు తగిన సమాచారం చేతిలో ఉంటుంది. ప్రత్యామ్నాయాలూ సిద్ధంగా ఉంటాయి. ఫలితాల మీదా స్పష్టత ఉంది. ఇక్కడే అసలైన చిక్కు వస్తుంది. ఏ మనిషికైనా కొన్ని అభిప్రాయాలు, అనుమానాలు ఉంటాయి. అవన్నీ అతని నిర్ణయాన్ని తప్పకుండా ప్రభావితం చేస్తాయి. వీటినే కాగ్నిటివ్‌ బయాస్‌ అంటారు. మనస్తత్వ శాస్త్రం ఇందులో వందలాది రకాలను పేర్కొంటుంది. తన దృక్కోణం నుంచి మాత్రమే ఆలోచించే ఇగోసెంట్రిక్‌ బయాస్‌, ఒకే సమాచారాన్ని రకరకాలుగా విశ్లేషించే ఫ్రేమింగ్‌ ఎఫెక్ట్‌, తనను తాను తక్కువగానో ఎక్కువగానో అంచనా వేసుకునే డన్నింగ్‌ క్రూగర్‌ ఎఫెక్ట్‌, సమాచారంలోని ఏదో ఒక అంశానికి అతిగా ప్రాధాన్యమిచ్చే యాంకరింగ్‌ బయాస్‌… ఇలా సవాలక్ష ధోరణులు మనకు తెలియకుండానే మన నిర్ణయాధికారాన్ని శాసిస్తాయి.

అనేక రకాలుగా..

మంచి నిర్ణయాలు జీవితాన్ని, లోకాన్ని ఎలా మార్చేస్తాయో… తప్పుడు నిర్ణయాలు అంతే ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. కొన్ని ఉదాహరణలను విశ్లేషిస్తే ఓ నిర్ణయం ఎంత విలువైందో, దాని పర్యవసానాలు ఎంత దారుణమో అర్థమవుతుంది.

వ్యాపారం ఇప్పుడంటే సెల్‌ఫోన్‌తో పాటుగా కెమెరా తప్పనిసరి అయిపోయింది. ఫొటోలు తీసుకోవడం చిటికెలో పని. ఒకప్పుడు అదో పెద్ద తతంగం. డబ్బు, పరపతి ఉన్నవారికే సాధ్యం. అలాంటి నేపథ్యంలో ఫొటోగ్రఫీని ఇంటింటికీ పరిచయం చేసిన ఘనత కొడాక్‌ది. 1970లలోనే ఒక కొడాక్‌ ఇంజినీరు, అద్భుతమైన డిజిటల్‌ కెమెరాను రూపొందించాడు. దాన్ని చూసి యాజమాన్యం… ఇది కూడా ఓ కెమెరాయేనా అంటూ వెక్కిరించింది. రీలు కడిగించుకుని ఫోటోలు చేయించుకునే సౌలభ్యం లేని కెమెరా అసలు కెమెరానే కాదు అని తేల్చేసింది. లోకం మారుతున్నా, తన పాత పద్ధతులనే పట్టుకు వేలాడింది. ఫలితం! కొడాక్‌ కంపెనీ కనుమరుగైపోయింది.

పర్యావరణం

పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అనే సామెత చైనాలో కూడా ఉండే ఉంటుంది. అదే అస్ర్తాన్ని ప్రయోగించారు చైనీయులు. ఫలితమూ అనుభవించారు. పిచ్చుకలు పంటలను నాశనం చేస్తున్నాయనే కోపంతో.. పిచ్చుక కనిపిస్తే చంపేయమని ఆజ్ఞ ఇవ్వడమే కాకుండా, చంపినవారికి చంపినన్ని బహుమతులు కూడా ప్రకటించారు. రెండేళ్లపాటు అంతా కలిసి కోట్లాది పిచ్చుకలను చంపిపారేశారు. అయితే, పిచ్చుకల తొలి లక్ష్యం పంట కాదు, అక్కడ ఉండే కీటకాలు అని తెలుసుకునేసరికి ఆ జాతి కనిపించకుండా పోయింది. కీటకాలకు అడ్డూ అదుపూ లేకపోవడంతో పంటలు నాశనమై మహా కరువు వచ్చింది. తప్పు తెలుసుకుని పొరుగుదేశం నుంచి పిచ్చుకలను దిగుమతి చేసుకునేలోగా కరువుతో, కోట్ల మంది చనిపోయారు.

రాజకీయం

మొదటి ప్రపంచయుద్ధంలో జర్మనీ ఓటమిపాలైంది. ఆ అవమాన తీవ్రత జాతీయవాదానికి దారితీసింది. దాన్ని నిర్మాణాత్మకంగా తీర్చిదిద్దిన వ్యక్తి హిట్లర్‌. నాజీ పార్టీ అధ్యక్షుడిగా హిట్లర్‌, ప్రపంచాన్ని జయించాలని మాత్రమే కలలు కనలేదు. రష్యాను ఆక్రమించి, జర్మన్‌ పౌరులతో నింపేయాలని అనుకున్నాడు. 1939లో రష్యాతో జరిగిన శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించి, లక్షలమంది సైనికులను ఉసిగొల్పాడు. రెండో ప్రపంచయుద్ధంలో భాగమైన ఈ ఆక్రమణకు ఆపరేషన్‌ బర్బరోసా అని పేరు. మానవ చరిత్రలోనే అతి తీవ్రమైన దురాక్రమణగా దీనికి పేరు. అంకెలను చూసుకుని మురిసిన హిట్లర్‌… వాస్తవ పరిస్థితులను అంచనా వేయలేకపోయాడు. మాస్కో వరకు చేరుకున్నప్పటికీ… గడ్డ కట్టించే చలిలో జర్మన్‌ సైనికులు మనలేకపోయారు. వాళ్ల యుద్ధ ట్యాంకులకు మంచు, బురదలో నడిచే సత్తా లేకపోవడం మరో వైఫల్యం. ఒక్కసారిగా ప్రతికూలంగా మారిన పరిస్థితులను అంచనా వేసేందుకు వాళ్లు తీసుకున్న విరామం.. రష్యా పుంజుకునేలా చేసింది. జర్మనీ చిత్తుగా ఓడింది.

ఇన్‌స్టెంట్‌ నిర్ణయాలు… హ్యూరిస్టిక్‌

ప్రతిసారీ నిర్ణయం తీసుకోవడానికి తగినంత సమయం ఉండదు. అప్పటికప్పుడు చటుక్కున తీసేసుకోవాలి. ఇలాంటప్పుడు తగిన నిర్ణయం తీసుకునే నైపుణ్యాన్ని హ్యూరిస్టిక్‌ అంటారు. దీనికోసం కొన్ని మార్గాలు కూడా సూచిస్తారు.

☞ కాగితంలో ఓవైపు అనుకూలతలు, మరోవైపు ప్రతికూలతలు రాసుకుని ఏవి ఎక్కువ ఉన్నాయో గమనించుకోవడం.
☞ సమస్య అర్థం కాకపోతే, ఒక బొమ్మ లేదా ఫ్లో చార్ట్‌ ద్వారా దాన్ని కాగితం మీద పెట్టడం వల్ల సృజన పెరుగుతుంది. మార్గం తోస్తుంది.
☞ ఫలానా నిర్ణయం ఎలా ఉంటుంది అని ముందుగానే ఆలోచించుకుని… దానినుంచి వెనక్కి జరుగుతూ విశ్లేషించడం.
☞ ఒక ప్రత్యేకమైన సమస్యగా కాకుండా… ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందో ఆలోచించి, దాన్ని అమలు చేయడం. ఓ మంచి నిర్ణయం తీసుకోవడం గురించి అనాదిగా ఎన్నో సూక్తులు వినిపిస్తూనే ఉన్నాయి. కావ్యాల నుంచి వ్యక్తిత్వ వికాస పుస్తకాల వరకు… విలువైన సూచనలు కనిపిస్తాయి. భగవద్గీత మొదలైందే ఏ నిర్ణయం తీసుకోవాలి? అనే అర్జునుడి ‘సంశయం’ నుంచి కదా!

ఎంతో తేలిక…

నిర్ణయం తీసుకునే ముందు రకరకాల అంశాలు మదిలో మెదులుతాయి. ఆ అంశాల సంఖ్య పెరిగేకొద్దీ నిర్ణయం కష్టం అవుతుంది. మన అవసరం, మన బడ్జెట్‌, మన అభిరుచి.. ఈ మూడు కొలమానాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని మిగతావన్నీ కొట్టేయాలి. దీంతో జాబితాలోని పది ఆప్షన్లలో ఎనిమిది పక్కకు తొలగిపోతాయి. మిగతా రెండుమూడు ప్రత్యామ్నాయాలలో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. బలమైన నిర్ణయం తీసుకోవచ్చు. ఉదాహరణకు ఫ్లాట్‌ కొనాలనుకుంటారు. ఏ హౌసింగ్‌.కామ్‌లోనో చూస్తే.. వందలకొద్దీ ‘ఫ్లాట్‌ ఫర్‌ సేల్‌’ ప్రకటనలు. శోధన ప్రారంభించే ముందు.. మన బడ్జెట్‌ ఎంత? ఎంత విస్తీర్ణంలో ఉండాలి? ఏ ప్రాంతంలో అయితే ఉత్తమం? ఈ మూడు విషయాల్లో స్పష్టత వచ్చాక.. సెర్చ్‌ ప్రారంభిస్తే నిర్ణయం తేలికైపోతుంది. కొలంబియా యూనివర్సిటీ అధ్యయనం కూడా ఇదే మాట చెప్పింది.

మెదడుపైనా ప్రభావం..

నచ్చిన కారును ఎంచుకోవడంలోని ఆనందం, నచ్చిన బిస్కెట్‌ను కొనుక్కుని తినడంలోని ఆనందమూ దాదాపుగా సమానమే. కాకపోతే ఒక ఆనందం విలువ పది లక్షలు, మరో ఆనందం విలువ పది రూపాయలు. అందువల్ల ఖరీదైన షాపింగ్‌తోనే బ్రహ్మాండమైన ఆనందం సొంతం అవుతుందని అనుకోవడం అపోహే. కాబట్టి మనకు సంతృప్తిని, సంతోషాన్ని ఇచ్చే నిర్ణయాల విషయంలో స్పష్టత కనుక ఉంటే.. నిరాడంబర జీవితంతోనే.. మహదానందాన్ని ఆస్వాదించవచ్చు. స్విట్జర్లాండ్‌ టూర్‌ వెళ్లాల్సిన పన్లేదు, డాబా మీద నిలబడి సూర్యోదయ సూర్యాస్తమయాల్ని తిలకిస్తూ కూడా గొప్ప అనుభూతిని పొందవచ్చు.

కొలువులోనూ కీలకం

కెరీర్‌తోనూ నిర్ణయ కళకు ముడిపెట్టారు మానసిక వేత్తలు. ఉద్యోగంలో, పనిలో నిర్ణయాధికారం ఉన్న సిబ్బంది.. ఆ అవకాశంలేని వారితో పోలిస్తే చాలా ఆరోగ్యంగా ఉన్నారట. మనిషి స్వతహాగా నిర్ణయ జీవి. ఏ పని చేయాలో, ఎంతసేపు చేయాలో, ఎలా చేయాలో, ఎంత బాగా చేయాలో.. నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉన్నప్పుడే ప్రేమగా చేస్తాం. శ్రద్ధ పెడతాం. సృజన జోడిస్తాం. అదనపు సమయం కేటాయించడానికి కూడా ఇష్టపడతాం. ఏ మాత్రం నిర్ణయ శక్తి లేనప్పుడు ఆ పని యాంత్రికంగా మారుతుంది. విసుగుపుట్టిస్తుంది. భారం పెరిగినప్పుడు ఒత్తిడికి గురవుతాం. ఆ ఒత్తిడి గుండెపై ప్రభావం చూపుతుంది. మనసును గాయపరుస్తుంది. ఫలితంగా శారీరక, మానసిక రోగాలు చుట్టుముడతాయి. కాబట్టి కెరీర్‌ను ఎంచుకుంటున్నప్పుడు నిర్ణయాత్మక శక్తి ఉన్నవాటినే ఎంచుకోవాలి, కొంత జీతం తగ్గినా సరే. అంతేకాదు సిబ్బంది అనుభవంతో, నైపుణ్యంతో, నిర్ణయ సామర్థ్యంతో నిమిత్తం లేని పనుల్ని ఏ రోబో అయినా చేయగలదు. అలాంటి కొలువులు ఎక్కువకాలం నిలబడవు కూడా. పిల్లల ఆటబొమ్మలకూ ఈ పోలిక వర్తిస్తుంది. కన్నవారు చేతికిచ్చిన బొమ్మతో ఆడుకున్న పిల్లలతో పోలిస్తే.. తమకు నచ్చిన బొమ్మను ఎంచుకుని ఆడుకునే పిల్లలే ఎక్కువ ఆనందాన్ని ఆస్వాదించినట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. తల్లిదండ్రుల ప్రభావానికి అతీతంగా తమ చదువుల్ని ఎంచుకున్న విద్యార్థులు, మిగిలినవారితో పోలిస్తే అత్యుత్తమ స్థానాల్లో ఉన్నట్టు కూడా ఓ సర్వే వెల్లడిస్తున్నది.

జామ్‌ థియరీ

‘ఆర్ట్‌ ఆఫ్‌ చూజింగ్‌’ రచయిత్రి షీనా అయ్యర్‌ ఎంపిక కళకు శాస్త్ర ప్రతిపత్తి తీసుకొచ్చారు. ఎంత తక్కువ చాయిస్‌ ఉంటే అంత బలమైన నిర్ణయం తీసుకోగలమని అంటారామె. ఆపిల్‌ విజయ రహస్యమూ ఇదే. ఆ సంస్థ కుప్పలకొద్దీ మాడల్స్‌తో ఉక్కిరిబిక్కిరి చేయదు. రంగుల ఎంపికలోనూ అతికొద్ది ఆప్షన్లే. దేన్ని ఎంచుకోవాలి అనే విషయంలో కొనుగోలుదారుడు పెద్దగా తర్జనభర్జన పడాల్సిన పని ఉండదు. ఇదే సందర్భంలో షీనా ఓ పండ్ల జామ్‌ దుకాణాన్ని ఉదాహరణగా తీసుకున్నారు. ఓ షాప్‌లో పాతికరకాల జామ్‌లను కస్టమర్లకు ఉచితంగా రుచి చూపిస్తారు. ఇంకో దుకాణంలో నాలుగైదు రుచులనే పరిచయం చేస్తారు. అంతిమంగా కస్టమర్లు నాలుగైదు జామ్‌లను రుచి చూపించిన దగ్గరే షాపింగ్‌ చేస్తారు. కారణం, ఇక్కడ చాయిస్‌ తక్కువ. స్పష్టత ఎక్కువ. మనమూ అంతే. ఏ ప్యారడైజ్‌కో వెళ్లినప్పుడు.. రెండో ఆలోచన లేకుండా బిర్యానీ ఆర్డర్‌ చేస్తాం. అదే ఉడుపి హోటల్‌కు వెళ్తే.. ఇడ్లీ సాంబార్‌ నుంచి బిసిబేళెబాత్‌ వరకు రకరకాల రుచులు. ఓ నిర్ణయానికి రావడానికి చాలా సమయం తీసుకుంటాం. ఒకటికి పదిసార్లు మెనూ తిరగేస్తాం.

Share on Google Plus

About Tefza Demo

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.