World Egg Day: Is it good to drink raw eggs? Or should it be cooked and eaten ?Explanation.
Egg Health Benefits: The importance of egg as a complete food for people of all ages is not all. Egg is on the top of the list of favorite foods from babies to adults.
Those suffering from nutritional deficiency can overcome the problem by eating one egg a day. But you can know whether raw egg is better to drink or boiled egg is better.
Egg Health Benefits: In this world.. is there any healthy food item that is tasty, safe, rich in nutrients, cheap, can be cooked in a pinch, available in all seasons, and loved by people of all ages...? The answer is only one! Egg! Many people consider milk as a complete food. It is believed that consuming milk alone provides a lot of nutrients even if nothing else is consumed. But the perfect food for milk is egg! It contains all other nutrients, vitamins and minerals except vitamin-C and fiber. Egg is a very special food in both of these!
World Egg Day : పచ్చిగుడ్డు తాగితే మంచిదా ? లేక ఉడికించి తినాలా ?వివరణ.
Egg Health Benefits: అన్ని వయసుల వారికి సంపూర్ణ ఆహారంగా పనికొచ్చే గుడ్డు ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. పసిపిల్లల మొదలుకొని పండు ముసలి వరకు చాలా ఇష్టంగా తినే వాటిలో గుడ్డు టాప్‌లో ఉంటుంది.
పోషకాహార లేమితో బాధపడే వారు రోజుకు ఓ గుడ్డు తినడం ద్వారా ఆ సమస్యను అధిగమించొచ్చు. అయితే పచ్చిగుడ్డు తాగడం మంచిదా లేదా గుడ్డు ఉడికించి తింటే మేలా అనే విషయాలను తెలుసుకోగలరు.
Egg Health Benefits: ఈ ప్రపంచంలో.. మంచి రుచికరమైన, సురక్షితమైన, పోషకాలన్నీ సమృద్ధిగా ఉన్న, చవకైన, చిటుక్కున వండుకోవటానికి వీలైన, అన్ని కాలాల్లోనూ దొరికే, అన్ని వయసుల వారికీ నచ్చే ఆరోగ్యకరమైన ఆహార పదార్థం ఏదైనా ఉందా...? సమాధానం ఒక్కటే! గుడ్డు! చాలామంది పాలను సంపూర్ణ ఆహారం అంటుంటారు. మిగతావేమీ తీసుకోకపోయినా ఒక్క పాలును తీసుకుంటే చాలా పోషకాలు లభిస్తాయని భావిస్తుంటారు. అయితే పాలకు సరిసాటిగా నిలిచే సంపూర్ణ ఆహారం.. గుడ్డు! విటమిన్-సి, పీచు పదార్థం- ఈ రెండూ తప్పించి మిగతా అన్ని పోషకాలూ, అన్ని విటమిన్లూ, ఖనిజాలూ ఉంటాయి వీటిలో. ఈ రెంటిలో కూడా గుడ్డు ఎంతో ప్రత్యేకమైన ఆహారం!
World Egg Day 2022: సాధారణంగా మనం ఏ ఆహారం తీసుకున్నా అది జీర్ణమై, దాన్ని మన శరీరం గ్రహించి, వినియోగించుకునే క్రమంలో ఎంతోకొంత వ్యర్థమై పోతుంటుంది. తిన్న పదార్థంలో ఎంతమేరకు మన శరీరానికి ఉపయోగపడుతోందనే దాన్ని 'బయోలాజికల్ వాల్యూ' అంటారు. దీని ప్రకారం గుడ్డు బయోలాజికల్ విలువ నూటికి నూరు! మరే పదార్ధానికీ ఇంటి సంపూర్ణ విలువ లేదు. ఒక గ్రాము మాంసకృత్తులు శరీరానికి ఎంత బరువు ఇవ్వగలదనేది 'ప్రోటీన్ ఎఫిషియెన్సీ రేషియో' అంటారు. ఇది కూడా గుడ్డుకే ఎక్కువ. అందువల్ల ఎదిగే పిల్లలకు గుడ్డు బాగా ఉపయోగపడుతుంది.
మంచి ప్రోటీనుకు చిరునామా!
గుడ్డులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ప్రోటీన్లు. గుడ్డుతో పోలిస్తే పప్పుల వంటి వృక్ష సంబంధ పదార్ధాల నుంచి వచ్చే ప్రోటీను నాణ్యత కొంత తక్కువగా ఉంటుంది. పప్పుల్లో ప్రోటీను కొన్నిసార్లు సరిగా జీర్ణం కాదు. సాధారణ వృక్ష సంబంధ ప్రోటీను 1 గ్రాముకు గుడ్డులోని ప్రోటీను 0.8 గ్రాములు సమానం. గుడ్డులోని ప్రోటీన్లను సంపూర్ణ మాంసకృత్తులంటారు. పప్పులు, బియ్యం, గోధుమల్లో ఉండే ప్రోటీన్ నాణ్యతను కూడా గుడ్డులోని ప్రోటీన్‌తో పోల్చి చూస్తారు. సంపూర్ణ మాంసకృత్తుల పరంగా చూస్తే గుడ్డు మొదటి స్థానంలో.. తర్వాత పాలు, మాంసాహారం ఉంటాయి.
పప్పుల్లోని ప్రోటీన్ల కంటే గుడ్డులోని ప్రోటీన్లు తేలికగా జీర్ణమవుతాయి.
అందువల్ల ఇవి ఎదుగుదలకు బాగా తోడ్పడతాయి.
కాబట్టి ఎదిగే పిల్లలకు అన్నం, పప్పుతో పాటు పాలు, గుడ్డు కూడా పెట్టాలి.
పెద్దవారిలోనూ ప్రోటీన్ కండరాలు క్షీణించకుండా కాపాడుతుంది.
హార్మోన్ల విడుదలకు, ఎంజైమ్‌ల తయారీ, శరీర మరమ్మతుకు కూడా ప్రోటీన్ అవసరం.
కాబట్టి పెద్దవాళ్లు కూడా రోజూ ఒక గుడ్డు తినటం మంచిది.
రోజూ తినటం ఉత్తమం
మన దేశంలో చాలామంది వారానికి ఒక గుడ్డు తీసుకుంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. పోషకాహార లోపం ఎక్కువగా ఉన్న, 47% ప్రజలు బరువు తక్కువగా ఉన్న మనదేశంలో గుడ్డు వాడకాన్ని పెంచటం, ప్రోత్సహించటం చాలా అవసరం. వారానికి 5-6 గుడ్లు తినొచ్చు. పిల్లలకు, గర్భిణులకు తప్పనిసరిగా రోజుకు ఒక గుడ్డు ఇవ్వటం మంచిది. గర్భం దాల్చినప్పుడు, కాన్పు కాగానే, పిల్లలకు పాలిచ్చేటప్పుడు.. ఇలా ప్రతి దశలో గుడ్డు స్త్రీలకు ఎంతగానో మేలు చేస్తుంది.
పసిపిల్లలకు ఎప్పుడు పెట్టాలి?
కొందరికి చేపలు పడవు, కొందరికి పప్పుదినుసులు పడవు.. ఇలా చాలామందికి మాంసకృత్తులు ఎక్కువగా ఉండే పదార్ధాలతో ఇబ్బంది ఉంటుంది. అలాగే గుడ్డులోని తెల్లసొన కూడా కొందరికి పడకపోవచ్చు. అందుకని పసిపిల్లలకు గుడ్డు పెట్టేటప్పుడు ముందుగా పచ్చసొన ఒక్కటే పెడతారు. సాధారణంగా ఆరేడు నెలలకు ఘనాహారం పెట్టటం ఆరంభిస్తారు కాబట్టి 7-8 నెలల నుంచి ఉడికించిన పచ్చసొన పెట్టొచ్చు. దాంతో అలర్జీలేమీ ఉండవు. పిల్లలకు కావాల్సిన పోషకాలూ దొరుకుతాయి. దాన్ని కొనసాగిస్తూ ఏడాది నిండే సరికి పూర్తి గుడ్డు మెత్తగా చేసి పెట్టొచ్చు.
నాటు-ఫారం ఏది మంచిది?
చాలామంది నాటుకోడి గుడ్లు మరింత బలవర్ధకమైనవనీ, వాటిలో పోషకాలు ఎక్కువుంటాయనీ భావిస్తుంటారుగానీ అది నిజం కాదు. నాటు గుడ్డులో అయినా, ఫారం గుడ్డులో అయినా లోపలుండే పోషకాలు ఒకటే. వాటిలో తేడా ఏమీ ఉండదు. అలాగే గుడ్డుపైన పెంకు రంగుకీ, లోపలి పోషకాలకూ కూడా ఎలాంటి సంబంధం ఉండదు. పైగా నాటు కోడి గుడ్డు సైజులో చిన్నగా, బరువు తక్కువగా ఉంటుంది కాబట్టి దాని నుంచి అందే పోషకాలు కూడా తక్కువ పరిమాణంలోనే ఉంటాయి. కాబట్టి మొత్తమ్మీద చూసుకుంటే నాటు గుడ్డు కంటే ఫారం గుడ్డు నుంచి పోషకాలు అధికంగా అందుతాయని గుర్తించాలి. పైగా ఫారం కోడికి పెట్టే ఆహారంలో విటమిన్-డి వంటివన్నీ ఉండేలా చూస్తారు కాబట్టి కొన్నిసార్లు వీటిలోనే విటమిన్-డి వంటి అరుదైన పోషకాలు అధికంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది.
పచ్చిది తాగొద్దు!
మన ప్రాంతంలో చాలామంది బలం వస్తుందని పచ్చిగుడ్డు తాగేస్తుంటారు. అది సరికాదు. గుడ్డును ఉడికించి తినటమే మంచిది. రెండోది- తెల్లసొనలో ఎవిడిన్ అనే పోషకాహార నిరోధకం ఉంటుంది. ఇది బయోటిన్‌తో కలిసిపోయి దాన్ని శరీరం వినియోగించుకోకుండా అడ్డుకుంటుంటుంది. గుడ్డును వేడిచేస్తే అది బయోటిన్ నుంచి విడిపోతుంది. గుడ్డులో ట్రిప్సిన్ అనే ఎంజైమ్‌ను పనిచేయకుండా చూసే నిరోధకం కూడా ఉంటుంది. వేడి చేసినప్పుడు ఇది కూడా నిర్వీర్యమవుతుంది. అందువల్ల గుడ్డును ఉడికించి, వండుకొనే తినటం మంచిది. చాలామంది శరీరానికి అధికంగా శక్తినిచ్చే పదార్ధాలు వేడి చేస్తాయని భావిస్తుంటారు. కానీ గుడ్డు లభించే శక్తి చాలా తక్కువగానే (70 క్యాలరీలే) ఉంటుంది కాబట్టి గుడ్డు వేడి చేస్తుందన్నది పూర్తిగా అపోహే.
బరువు తగ్గేందుకూ గుడ్డే!
పిల్లల్లో ఎదుగుదలకు, బరువు పెరిగేందుకు ఉపయోగపడే గుడ్డు.. పెద్దవారిలో, ముఖ్యంగా వూబకాయులు బరువు తగ్గటానికీ దోహదం చేస్తుంది. ఎందుకంటే గుడ్డు తెల్లసొనలోని ప్రోటీన్ కాస్త నెమ్మదిగా జీర్ణమవుతుంది. కడుపు నిండిన భావన కలిగిస్తుంది. త్వరగా ఆకలి వేయకుండా చూస్తుంది. పైగా ఈ ప్రోటీను జీర్ణం కావటానికీ కొంత శక్తి ఖర్చవుతుంది. కాబట్టి ఇది బరువు తగ్గటానికీ దోహదం చేస్తుంది.
చాలామంది డైటింగ్ చేసేవాళ్లు ఆహారం బాగా తగ్గించెయ్యటమే కాకుండా.. పండ్లు, కూరగాయలే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. వాటి నుంచి పిండిపదార్ధాలు తప్పించి రోజువారీ అవసరమైన ప్రోటీను దక్కదు. రోజూ మన శరీరానికి శరీర బరువులో ప్రతి కిలోగ్రాముకు ఒక గ్రాము ప్రోటీను అవసరం. ప్రతి గుడ్డు నుంచి సుమారుగా 7 గ్రాముల ప్రోటీను దక్కుతుంది, దాని నాణ్యత ఎక్కువ కాబట్టి వీరు గుడ్డు తీసుకోవటం మంచిది.
పచ్చసొన తీసెయ్యాలా?
చాలామంది పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుందని భావిస్తూ, దాన్ని తీసేసి తెల్లసొన మాత్రమే తింటుంటారు. గుడ్డులో కొలెస్ట్రాల్ ఉండే మాట నిజమే. ఒక గుడ్డులో 180 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. కానీ ఇతరత్రా ఆహార పదార్ధాల నుంచి అందే కొలెస్ట్రాల్‌తో పోలిస్తే ఇది చాలా తక్కువ. మామూలుగా మన శరీరం రోజుకు 800-1500 మిల్లీగ్రాములు వరకు కొలెస్ట్రాల్ తయారుచేసుకుంటుంది. ఇది కాకుండా మనం ఆహారం ద్వారా అదనంగా 300 మిల్లీగ్రాముల వరకు కొలెస్ట్రాల్ తీసుకోవచ్చు. మనం రోజుకు ఒక గుడ్డు తిన్నా 180 మిల్లీగ్రాముల కొలెస్ట్రాలే లభిస్తుంది.
అంటే ఆహారం ద్వారా తీసుకోవాల్సిన మొత్తంలో ఇది సగానికన్నా కాస్త ఎక్కువ. పైగా కొలెస్ట్రాల్‌ను నేరుగా రక్తంలో కలవకుండా చూసే లెసిథిన్ వంటి రసాయనాలూ గుడ్డులో ఉంటాయి. కాబట్టి గుడ్డుతో సమస్య ఉండదు. గుడ్డుతో పాటు ఇతర పదార్థాలు తీసుకున్నప్పుడు వాటిల్లోంచి చక్కెర నెమ్మదిగా విడుదలవుతుంది. అందువల్ల ఇది మధుమేహులకూ మేలు చేస్తుంది. వీరు వారానికి 3-4 గుడ్లు మామూలుగానూ.. తర్వాత 2-3 గుడ్లు పచ్చసొన తీసేసి తీసుకోవచ్చు. పూర్తిగా మానెయ్యాల్సిన అవసరం లేదు.
ఉపయోగాలు
- చీప్ అండ్ బెస్ట్‌లో ప్రోటీన్లు కావాలంటే కేవలం గుడ్డుతోనే సాధ్యం అని చెప్పొచ్చు.
- ఒక గుడ్డులో 7 నుంచి 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
- క్యాలరీలు 70 నుంచి 80 వరకు, కొవ్వులు కేవలం 5గ్రాములు, కొలెస్ట్రాల్ 190 గ్రాములు, నీరు 87శాతం శరీరానికి అందుతాయి.
- గుడ్డులోని పచ్చసొనలో విటమిన్లు ఉంటాయి.
- విటమిన్ డీ, ఏ, ఈ, కే లు ఉంటాయి. అంతేగాకుండా దీనిలో ఐరన్, జింక్, సెలీనియం, కాపర్ లాంటి ఖనిజాలు కూడా ఉంటాయి.
- యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అదనంగా లభిస్తాయి.
- గుడ్డును తీసుకోవడం వల్ల కంటి సమస్యలు దూరం అవుతాయి.
- అన్ని వయసుల వారు రోజుకు కనీసం ఒక గుడ్డును తీసుకోవడం మంచిదే.
- కానీ కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్న వారు మాత్రం ఒకటి కంటే ఎక్కువ తీసుకోకపోవడం ఉత్తమం.
- గట్టి పెంకుతో ఉంటుంది కాబట్టి కోడి గుడ్డు అంత సులభంగా కలుషితం కాదు.
- ఉడికించి తినడం వల్ల కల్తీ నూనెల బెడద కూడా ఉండదు.
- బయోలాజికల్ వ్యాల్యూ 100 శాతంగా చెప్పుకోవచ్చు.
- ఆరునెలలు దాటిన తరువాత చిన్నారులకు గుడ్డు పెట్టడం అలవాటు చేస్తే.
- వారికి పౌష్ఠిక ఆహారం అందుతుంది. కానీ ఈ సమయంలో వారికి కేవలం ఉడకబెట్టిన గుడ్డు మాత్రమే ఇవ్వాలి.
- 40 ఏళ్లు దాటిన వారు ఆరోగ్య పరీక్ష అనంతరం డాక్టర్ సూచన మేరకు మాత్రమే తీసుకోవాలి.
- గుడ్డులో ఉండే క్యాల్షియం శరీరంలోని జుట్టు, చర్మం, గోర్లు లాంటివి ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తుంది.
- విటమిన్ డీ లోపంతో బాధపడే వారు.. రోజుకు ఒక గుడ్డు తీసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.
- డైట్లో ఉండే వారికి గుడ్డు ఎంతో మేలు చేస్తుంది.
- వ్యాయామం అనంతరం దీనిని తీసుకుంటే శక్తిని తిరిగి పుంజుకునేందుకు దీనిలోని అమైనో ఆమ్లాలు ఉపయోగపడుతాయి.
- కాలేయ జబ్బు, ధమనులు గట్టి పడటం, నాడీ సమస్యలు రాకుండా ఉండేందుకు గుడ్డు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
- రొమ్ము క్యాన్సర్ రాకుండా కాపాడే శక్తి గుడ్డుకు ఉందని వివిధ పరిశోధనల్లో తేలింది.
- గుడ్డుతో గుండెకు ఎంతో ప్రయోజనం.
- గుండె నొప్పి వచ్చే ప్రమాదాన్ని నివారించవచ్చని వైద్యులు చెప్తున్నారు.
- అందుకే రోజుకు ఓ గుడ్డు తినడం అలవాటు చేసుకోవడం మంచిది.