AP CETs: These are the dates for AP entrance exams.. Application deadline, release of hall tickets, exam dates
Alert for students in AP. AP Entrance Tests for the academic year 2023-24 are approaching. In this background, students are continuing their preparation. AP EAPCET for Engineering/Agricultural courses as well as applications for admissions to various PG courses are already underway. As per the schedule released by the AP Council of Higher Education (APSCHE), which varsity will conduct which of the eight entrance exams? Know the last date of applications, release of hall tickets, exam dates and other important information at one place.
AP CETs: ఏపీలో ప్రవేశ పరీక్షల తేదీలు ఇవే.. దరఖాస్తు గడువు, హాల్‌టికెట్ల విడుదల, పరీక్ష తేదీలు
ఏపీలో విద్యార్థులకు అలర్ట్. 2023-24 విద్యా సంవత్సరంలో ఉన్నత విద్యలో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షల(AP Entrance Tests)కు గడువు సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ప్రిపరేషన్‌ను కొనసాగిస్తున్నారు. ఇంజినీరింగ్/అగ్రికల్చరల్ కోర్సుల కోసం నిర్వహించే ఏపీ ఈఏపీసెట్(AP EAPCET)తో పాటు పలు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఏపీ ఉన్నత విద్యామండలి (APSCHE) విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మొత్తం ఎనిమిది ప్రవేశ పరీక్షల్లో ఏ పరీక్షను ఏ వర్సిటీ నిర్వహిస్తుంది? దరఖాస్తుల తుది గడువు ఎప్పుడు, హాల్‌టికెట్ల విడుదల, పరీక్ష తేదీలు తదితర కీలక సమాచారం ఒకేచోట తెలుసుకోండి.
ఏపీ ఈఏపీసెట్
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈఏపీసెట్-2023 పరీక్షను జేఎన్‌టీయూ అనంతపురం నిర్వహించనుంది. ఈ పరీక్ష కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు ఏప్రిల్ 14తో ముగియనుంది. రూ.500ల ఆలస్య రుసుంతో ఏప్రిల్ 30వరకు; ₹1000 ఆలస్య రుసుంతో మే 5వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. అలాగే, రూ.5వేల ఆలస్య రుసుంతో మే 12వరకు; రూ.10వేల ఆలస్య రుసుంతో మే 14వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. హాల్‌టికెట్లను మే 9 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏపీఈఏపీ సెట్ (ఇంజినీరింగ్ పరీక్ష మే 15 నుంచి 18వరకు జరుగుతుంది. అగ్రికల్చర్ & ఫార్మసీ పరీక్ష మే 22 నుంచి 23 వరకు జరగనుంది.
ఏపీ ఐసెట్
రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐసెట్) పరీక్షను ఈ ఏడాది శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నిర్వహించనుంది. దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 19వరకు కొనసాగుతుంది. రూ.100 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 20 నుంచి 26వరకు; రూ.2వేల రుసుంతో ఏప్రిల్ 27 నుంచి 3వరకు; రూ.3000 రుసుంతో మే 10వరకు; రూ.5వేల రుసుంతో మే 15వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 20 నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష మే 24, 25 తేదీల్లో ఉదయం 9గంటల నుంచి 11.30గంటల వరకు; అలాగే, మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు జరుగుతుంది.
ఏపీఈసెట్
ఏపీలో ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఈసెట్)-2023 పరీక్షను కాకినాడ జేఎన్‌టీయూ నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ(మ్యాథమేటిక్స్) అభ్యర్థులకు వచ్చే సంవత్సరంలో బీఈ/ బీటెక్/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు ఏప్రిల్ 10తో ముగుస్తుంది. రూ.500 ఆలస్యరుసుంతో ఏప్రిల్ 15వరకు; ₹2వేల రుసుంతో ఏప్రిల్ 19వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ₹5వేల ఆలస్యరుసుంతో ఏప్రిల్ 24వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఏప్రిల్ 28 నుంచి టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 5న పరీక్ష జరుగుతుంది. 9న ప్రిలిమినరీ కీ విడుదల చేస్తారు.
ఏపీ పీజీఈసెట్
ఏపీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2023 (ఏపీ పీజీఈసెట్)ను తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ నిర్వహించనుంది. ఎంటెక్, ఎంఫారస్మీ, ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 30వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. రూ.500 ఆలస్య రుసుంతో మే 6వరకు; ₹2వేల రుసుంతో మే 10వరకు; ₹5వేల రుసుంతో మే14వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 22న హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 28 నుంచి 30 తేదీల్లో పరీక్ష జరుగుతుంది. గేట్/ జీప్యాట్ అర్హత సాధించిన అభ్యర్థులకు విడిగా నోటిఫికేషన్ ఇస్తారు.
ఏపీ పీఈసెట్
వ్యాయామ విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(ఏపీ పీఈసెట్)- 2023ను గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నిర్వహించనుంది. రెండేళ్ల వ్యవధిగల బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షకు మే 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. రూ.500ల ఆలస్య రుసుంతో మే 17వరకు; రూ.1000 రుసుంతో మే24వరకు దరఖాస్తులు చేసుకొనే అవకాశం కల్పించారు. మే 27 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫిజికల్ ఎఫిషియెన్సీ, గేమ్స్ స్కిల్ టెస్ట్ మే 31 నుంచి నిర్వహిస్తారు. అభ్యర్థులు ఉదయం 6గంటలకే రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. టెస్ట్ ముగిసిన వారం రోజుల తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు.
ఏపీ ఎడ్‌సెట్
ఏపీలో బీఈడీ, బీఈడీ (స్పెషల్) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎడ్‌సెట్) 2023 పరీక్షను ఆంధ్రాయూనివర్సిటీ నిర్వహించనుంది. ఈ పరీక్ష కోసం ఏప్రిల్ 23వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. రూ.100 ఆలస్య రుసుంతో మే 2వరకు, రూ.2వేల ఆలస్య రుసుంతో మే 10వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 12 నుంచి హాల్‌టికెట్లు పొందొచ్చు. మే20న ఉదయం 9గంటల నుంచి 11 గంటల మధ్య పరీక్ష జరుగుతుంది. 24న ప్రిలిమినరీ కీ విడుదల చేస్తారు.
ఏపీ లాసెట్
మూడు, ఐదేళ్ల ఏపీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ లాసెట్- 2023), ఏపీ పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ పీజీఎల్‌సెట్-2023)కు గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 22వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. రూ.500 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 29 వరకు; రూ.1000 రుసుంతో మే 5వరకు; రూ.2వేల రుసుంతో మే 9వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. హాల్‌టికెట్లు మే 15 నుంచి అందుబాటులో ఉంటాయి. మే 20న మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 4.30గటల వరకు ఏపీ లాసెట్, ఏపీ పీజీఎల్‌సెట్ పరీక్ష జరగనుంది.
ఏపీ పీజీసెట్
ఏపీలోని పలు విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ పీజీ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023(ఏపీ పీజీసెట్) సెట్‌ను ఆంధ్రా యూనివర్సిటీ నిర్వహించనుంది. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ మే 11తో ముగుస్తుంది. రూ.500 ఆలస్య రుసుంతో మే 21వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 1 నుంచి హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచుతారు. పరీక్షలు జూన్ 6 నుంచి 10వరకు మూడు షిఫ్టుల్లో కొనసాగుతాయి. ఉదయం 9.30గంల నుంచి 11 గంటల వరకు; మధ్యాహ్నం 1గంట నుంచి 2.30గంటల వరకు; సాయంత్రం 4.30గంటల నుంచి 6గంటల వరకు. ప్రిలిమినరీ కీ విడుదల చేసిన తర్వాత ఫలితాలు ప్రకటిస్తారు.